sasikala: సత్ప్రవర్తన పేరుతో శశికళను బయటకు తెచ్చేందుకు దినకరన్ పావులు.. మారనున్న తమిళ రాజకీయ ముఖచిత్రం!
- త్వరలోనే ఆమె బయటకు వస్తారన్న దినకరన్
- ‘చిన్నమ్మ’ బయటకు వస్తే ప్రభుత్వం మళ్లీ ఆమె చెప్పుచేతల్లోకే?
- కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడంతో విడుదల కష్టమంటున్న విశ్లేషకులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ త్వరలో బయటకు రాబోతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సత్ప్రవర్తన పేరుతో ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలులో ఆమె ఉన్నారు.
శశికళ విడుదల కోసం దినకరన్ ప్రయత్నిస్తున్న విషయం బయటకు పొక్కడంతో తమిళ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఆమె జైలు నుంచి బయటకు వస్తే రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్న దానిపై ఇప్పటికే చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన లోక్‌సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో ఏఎంఎంకేకు ఘోర పరాభవం ఎదురైంది. దీంతో ఆ పార్టీ నుంచి ఒక్కో నేత బయటకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో శశికళ బయటకు వస్తే ఆమె విశ్వాసపాత్రులుగా చెప్పుకుంటున్న వారిలో తిరిగి ఎంతమంది వెనక్కి వస్తారన్న దానిపై అంచనాలు మొదలయ్యాయి.
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పడిన ‘చిన్నమ్మ’ శశికళ ఇప్పటికే రెండున్నరేళ్ల శిక్షను పూర్తి చేసుకున్నారు. దీంతో సత్ప్రవర్తన నిబంధనల మేరకు ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీటీవీ దినకరన్ తెలిపారు. త్వరలోనే ఆమె బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శశికళ బయటకు వస్తే అన్నాడీఎంకేలోని ఆమె విశ్వాసపాత్రులు తిరిగి ఆమె చెంతకు చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం తిరిగి ఆమె చెప్పుచేతల్లోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, కర్ణాటకలోని ప్రస్తుత పరిస్థితులు శశికళకు ఏమాత్రం అనుకూలంగా లేవన్న ప్రచారం కూడా జరుగుతోంది. గత నెల రోజులుగా జరుగుతున్న హైడ్రామాకు తెరపడి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో శశికళ బయటకు రావడం కష్టమేనన్న వాదన కూడా వినిపిస్తోంది.