Hyderabad: పెద్దమ్మ ఇంటినే దోచేసిన యువతి.. బంగారం, నగదు చోరీ

  • ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు చోరీ
  • స్నేహితుల సాయంతో ప్లాన్ అమలు
  • 53.8 తులాల బంగారం, రూ.5.25లక్షల నగదు స్వాధీనం

తండ్రి, సోదరుడు అనారోగ్యం పాలవడంతో ఇబ్బందుల పాలైన కుటుంబాన్ని ఆదుకునేందుకు ఓ యువతి వక్రమార్గం పట్టింది. సొంత పెద్దమ్మ ఇంటికే కన్నం వేసి కటకటాలపాలైంది. హైదరాబాద్‌లోని రాంనగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  పోలీస్ అకాడమీలో పిళ్లా వినయకుమారి టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. కుమార్తె కీర్తితో కలిసి రాంనగర్‌లోని గణేశ్ నగర్‌లో ఉంటోంది. వరుసకు కుమార్తె అయ్యే కుష్బూ అనే యువతి తరచూ వీరింటికి వచ్చేది. వెంటాడుతున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఖుష్బూ వక్రమార్గం పట్టింది.

పెద్దమ్మ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది. ఇంటిలోని అణువణువు తన మొబైల్‌లో చిత్రీకరించింది. ఆ వీడియోను స్నేహితులు సూర్య, వంశీలకు పంపింది. ఈ నెల 19న పెద్దమ్మ వినయకుమారి ఇంటికి వెళ్లిన ఖుష్బూ నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి తల్లీకూతుళ్లకు ఇచ్చింది. దానిని తాగిన వారు నిద్రలోకి జారుకున్నారు. ఓ గంట తర్వాత వినయకుమారి కుమార్తె కీర్తి నిద్రలేచింది. అయితే, తల్లి మాత్రం అపస్మారక స్థితిలోనే ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. తనకేమీ తెలియనట్టు ఖుష్బూ కూడా వారితో ఆసుపత్రికి వెళ్లింది.

అదే రోజు రాత్రి కీర్తికి తెలియకుండా ఆమె బ్యాగులోంచి తాళాలు తీసుకున్న ఖుష్బూ వాటిని స్నేహితుడు సూర్యకు అందజేసింది. అనంతరం సూర్య, వంశీలు కలిసి వినయకుమారి ఇంటికి వెళ్లి మొత్తం దోచేశారు. బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. పనిపూర్తయ్యాక తాళాలను తిరిగి ఖుష్బూకు ఇవ్వగా ఆమె వాటిని తిరిగి కీర్తి బ్యాగులో పెట్టేసింది.

ఈ నెల 23న ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి చేరుకున్న వినయకుమారి ఇంట్లోని బంగారం, నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖుష్బూపై అనుమానంతో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో సూర్య, వంశీలను అరెస్ట్ చేసి వారి నుంచి 53.8 తులాల బంగారం, రూ.5.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News