Andhra Pradesh: కేశినేని అనుచరులు, ట్రావెల్స్ ఉద్యోగుల మధ్య తోపులాట.. ఉద్రిక్తత!
- లెనిన్ సెంటర్ కు వచ్చిన కేశినేని అనుచరులు
- ఆందోళన విరమించాలని ఉద్యోగులకు సూచన
- వెనక్కి తగ్గబోమన్న కేశినేని ట్రావెల్స్ సిబ్బంది
విజయవాడ లెనిన్ సెంటర్ లో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ వేతన బకాయిలు చెల్లించాలని కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు ఈరోజు ఆందోళనకు దిగారు. కేశినేని యాజమాన్యం తమకు 8 నెలల బకాయిలు ఇవ్వలేదన్నారు. తమకు న్యాయం చేయకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రావెల్స్ ఉద్యోగుల ఆందోళన మీడియాలో రావడంతో కేశినేని అనుచరులు రంగంలోకి దిగారు. లెనిన్ సెంటర్ వద్దకు చేరుకుని ఆందోళనను విరమించాలని సూచించారు.
ఇవ్వాల్సిన బకాయిలను చెల్లిస్తామనీ, అయితే సిబ్బంది ముందుగా ఆందోళనను ఆపేయాలని స్పష్టం చేశారు. ఇందుకు అంగీకరించని సిబ్బంది ‘కేశినేని నాని అనుచరులు గో బ్యాక్’ అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడున్న పోలీసులు వెంటనే ఇరువర్గాలను శాంతింపజేశారు. కేశినేని నాని అనుచరులను అక్కడి నుంచి పంపించివేశారు.