Big Bash: వినూత్న రీతిలో ఐదు జట్ల మధ్య ప్లే ఆఫ్... క్రికెట్ లో కొత్త సంప్రదాయం తెచ్చిన బిగ్ బాష్ లీగ్!
- ఆసీస్ లో క్రికెట్ అభిమానులను అలరిస్తున్న బిగ్ బాష్
- క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లతో పాటు 'ది నాకౌట్', 'ది చాలెంజర్' గేమ్ లు
- ఫైనల్స్ కు వెళ్లేందుకు ఐదు జట్లకు అవకాశం
సాధారణంగా ఏ గేమ్ అయినా ప్లే ఆఫ్ దశకు వచ్చే సరికి నాలుగు జట్లు మిగులుతాయి. వాటిల్లో రెండు జట్ల మధ్య పోటీని పెట్టి, ఫైనల్స్ కు వెళ్లే జట్లను తేలుస్తారు. కానీ, ఐపీఎల్ లో ప్లే ఆఫ్ ఎలిమినేటర్, క్వాలిఫయర్ విధానంలో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లానే ఆస్ట్రేలియాలో క్రికెట్ అభిమానులను అలరించే బిగ్ బాష్ లీగ్, ఐదు జట్లతో ప్లే ఆఫ్ మ్యాచ్ లను నిర్వహించాలన్న వినూత్న నిర్ణయం తీసుకుంది.
ఈ విధానంలో నిబంధనలను పరిశీలిస్తే, లీగ్ దశలో టాప్-5 లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో 'ది నాకౌట్' మ్యాచ్ ఆడుతుంది. ది నాకౌట్ లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్ గేమ్ లో ఓడిన జట్టుతో 'ది చాలెంజర్' గేమ్ ఆడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్ తో ఫైనల్ ఆడుతుంది. ఈ విధానం బాగుందని, నాలుగు జట్లకు బదులు ఐదు జట్లకు ఫైనల్ చాన్స్ వస్తుందని క్రీడాభిమానులు అంటున్నారు.