saiber crime: రూ.కోట్లు ఆశపెట్టి రూ.70 లక్షలకు టోకరా.. ఇదో నయా సైబర్ నేరం
- వరల్డ్ లాటరీ ఆర్గనైజేషన్ నుంచి ఈమెయిల్
- రూ.2500 కోట్ల ప్రైజ్ మనీ వచ్చిందని బురిడీ
- దఫదఫాలుగా డబ్బు లాగేసిన నేరగాళ్లు
మనిషి అత్యాశకు పోతే ఏం జరుగుతుందనే దానికి ఉదాహరణ ఈ ఘటన. ముక్కుమొహం తెలియని సంస్థ మీకు వరల్డ్ లాటరీ ఆర్గనైజేషన్‌లో 2500 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ వచ్చిందని ఆశ చూపించగానే నిజానిజాలు నిర్థారించుకోకుండానే ముందుకు వెళ్లిన ఓ అధికారి అత్యాశ అతన్ని నిలువునా ముంచింది. అతని జీవిత కష్టార్జితం రూ.70 లక్షలు దుండగుల పాలయ్యింది.
విశాఖ సైబర్ క్రైం పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన బి.రామకృష్ణకు 2015లో వరల్డ్ లాటరీ ఆర్గనైజేషన్ నుంచి ఓ మెయిల్ వచ్చింది. మీరు 250,000,000 బ్రిటన్ ఫౌండ్స్ (భారత కరెన్సీలో రూ.2500 కోట్లు) గెల్చుకున్నారన్నది దాని సమాచారం. దీంతో ఆశ్చర్యం, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయిన రామకృష్ణ తనకు వచ్చిన మెయిల్‌కి సమాధానం ఇచ్చాడు.
అట్నుంచి +448726148738 నంబరు నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు ఫాస్టర్ న్యూమాన్ అని, యూకేలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానని నమ్మబలికాడు. ప్రైజ్ మనీ సదరు సంస్థ తమ బ్యాంకులో జమ చేసిందని, దాన్ని తీసుకునేందుకు యూకేలో బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉందని తెలిపాడు. ఇందుకు కొంత సొమ్ము కట్టాలని చెప్పాడు. ఖాతా తెరిచాక ఏటీఎం కార్డు పంపిస్తామని, దాన్ని ఉపయోగించి ప్రైజ్‌మనీ తీసుకోవచ్చని నమ్మబలికాడు.
అదంతా వాస్తవమేనని నమ్మిన రామకృష్ణ సదరు వ్యక్తి చెప్పిన ఖాతాకు రూ.34,500లు డిపాజిట్ చేశాడు. చెప్పినట్టే ఏటీఎం కార్డు పంపిన కేటుగాళ్లు అది పనిచేయాలంటే ప్రపంచ బ్యాంక్‌కు, యాంటీ టెర్రరిస్టు నిధుల సమీకరణకు, బీమాకు అంటూ పలుమార్లు నగదు జమ చేయించుకున్నారు. చెప్పినవన్నీ చేసినా ఏటీఎం కార్డు ద్వారా నగదు రాకపోవడంతో రామకృష్ణ, ఫాస్టర్ న్యూమాన్‌ను మళ్లీ సంప్రదించాడు. రామకృష్ణ పూర్తిగా తమ ట్రాప్ లో ఉన్నాడన్న నిర్ధారణకు వచ్చిన దుండగులు ప్రైజ్‌మనీని తమ ప్రతినిధి కెల్విన్ ఫిలిప్స్ అప్పగిస్తారంటూ అతన్ని రామకృష్ణ ఇంటికి పంపించారు.
అతడు తన వెంట తెచ్చిన బాక్సులోని కొంత బ్లాక్ కోటెడ్ కరెన్సీని ఒక ద్రవంలో ముంచి యూకే పౌండ్లుగా మార్చి చూపించాడు. రామకృష్ణను పూర్తిగా నమ్మించాడు. తెచ్చిన ద్రవం అయిపోయిందని, యూకే తిరిగి వెళ్లాక దాన్ని కొరియర్‌లో పంపిస్తానని చెప్పి మరికొంత మొత్తం లాగేశారు. ఈ విధంగా రామకృష్ణ దఫదఫాలుగా వారికి రూ.70 లక్షల వరకు ముట్టజెప్పాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోవటంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు విశాఖ సైబర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. సి.ఐ. గోపినాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.