Iran: తమ చెరలో ఉన్న భారతీయులలో 9 మందిని విడిచిపెట్టిన ఇరాన్

  • ఇరాన్ చెరలో ఇంకా 21 మంది భారతీయులు
  • జిబ్రాల్టర్ పోలీసుల అదుపులో 24 మంది క్రూ సిబ్బంది
  • విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వం

తమ చెరలో ఉన్న 12 మంది భారతీయుల్లో తొమ్మిది మందిని ఇరాన్ విడిచిపెట్టింది. ఈ నెల మొదట్లో ఎంటీరియా అనే నౌకను ఇరాన్ తన అధీనంలోకి తీసుకుంది. అందులో ఉన్న 12 మంది భారతీయుల్లో 9 మందిని విడిచిపెట్టినట్టు గురువారం ఇరాన్ ప్రకటించింది. కాగా, ఇరాన్ చెరలో ఇంకా 21 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎంటీరియా నౌకలోని వారు కాగా, బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ స్టెనా ఇంపీరియాలో 18 మంది భారతీయులు ఉన్నారు. అంతర్జాతీయ సముద్ర జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై  స్టెనా నౌకను ఇరాన్ రివల్యూషనరీ గార్డులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

ఇంపీరియా నౌకలో బందీలుగా ఉన్న 18 మంది భారతీయులతో గురువారం భారత ఎంబసీ అధికారులు మాట్లాడినట్టు తెలుస్తోంది. కాగా, జిబ్రాల్టర్ పోలీసుల అదుపులో ఉన్న ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ ‘గ్రేస్ 1’ నౌకలోని 24 మంది భారత సిబ్బంది ఇంకా వారి అదుపులోనే ఉన్నారు.

ఇరాన్‌పై అమెరికా తిరిగి ఆంక్షలు విధించినప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ బ్రిటిష్ నౌకను అధీనంలోకి తీసుకుంది. జిబ్రాల్టర్ పోలీసుల అధీనంలో ఉన్న ‘గ్రేస్1’ నౌకలో బందీలుగా ఉన్న 24 మంది సిబ్బందిని భారత అధికారులు కలిశారని, వారిని విడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News