Nara Lokesh: ఈ రకమైన స్టేట్ మెంట్ ఏంటి జగన్ గారూ?: నారా లోకేశ్
- మద్యంపై పరస్పర విరుద్ధంగా జగన్ స్టేట్ మెంట్
- అసలింతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు
- 'వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ' అన్న లోకేశ్
మద్యం కారణంగా మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీరు తుడుస్తానని మాట ఇచ్చిన తాను, నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని అంటూ, మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ, చట్టం తెచ్చామని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. "మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి" "మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే" అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్ మెంట్లు ఇచ్చారు, అసలింతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వైఎస్ జగన్ గారూ?" అని ప్రశ్నించారు.
ఈ మేరకు లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఆపై "మొదటి బడ్జెట్లో మద్యం మీద ఆదాయాన్ని గత ఏడాదికన్నా రూ. 2,297 కోట్లు ఎక్కువ అంచనా వేసారు. ఇప్పుడేమో, ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అంటున్నారు. ఇక మన వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ. ఇసుక వాలంటీర్లు తరువాత, మద్యం వాలంటీర్లు.. పండగ చేసుకోండి" అని మరో ట్వీట్ ను పెట్టారు.