Indian market: భారత మార్కెట్ పై కన్నేసిన ‘నెట్ ఫ్లిక్స్’.. 199కే కొత్త ప్లాన్ ప్రకటన!
- ఇప్పటివరకూ కనీస ప్లాన్ గా రూ.500 వసూలు
- భారత మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు
- అమెజాన్ ప్రైమ్ ను వెనక్కు నెట్టాలని వ్యూహం
ప్రముఖ ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తన పోటీ కంపెనీ అమెజాన్ ప్రైమ్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకూ నెలకు రూ.500 కనీస చార్జీ వసూలు చేస్తున్న నెట్ ఫ్లిక్స్.. భారత మార్కెట్ లో అమెజాన్ ను వెనక్కి నెట్టేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా రూ.199కే నెలవారీ ప్లాన్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ప్లాన్ లో ఎలాంటి యాడ్లు లేకుండా స్టాండర్డ్ డెఫినేషన్ వీడియోలను ప్రేక్షకులు వీక్షించవచ్చని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. అయితే ఈ సౌకర్యం కేవలం భారత్ లోని స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల యూజర్లకు మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం తమకు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో 14.8 కోట్ల మంది చందాదారులు ఉన్నట్లు పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ నెలకు రూ.129లతో ప్రస్తుతం సేవలు అందిస్తోంది.