assemnly: లోటస్‌పాండ్‌ను తలపిస్తున్న శాసన సభ: చంద్రబాబు మండిపాటు
- జగన్ కనుసన్నల్లో స్పీకర్ సభ నడిపిస్తున్నారు
- సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపణ
- కాలినడకన అసెంబ్లీకి చంద్రబాబు, లోకేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ శాసన సభ హైదరాబాద్‌లోని జగన్ నివాసం లోటస్‌పాండ్‌ను తలపిస్తోందని, అక్కడ ప్రజాస్వామ్య విధానాలు మచ్చుకు కూడా కనిపించడం లేదని విపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. సభ నిర్వహణ తీరుపై విపక్ష తెలుగుదేశం పార్టీ నిరసన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కాలినడకన ర్యాలీగా, ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి చేరుకుని తమ అసంతృప్తిని తెలియజేశారు.
సభలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్, విపక్ష నాయకులకు మైక్ ఇవ్వకపోవడంపై ధ్వజమెత్తుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బీఏసీ సమావేశంలో చెప్పింది ఒకటి, అసెంబ్లీలో జరుగుతున్నది మరొకటని ధ్వజమెత్తారు. జగన్ కనుసన్నల మేరకే స్పీకర్ సభను నడిపిస్తున్నారు తప్ప, సభ్యుల హక్కులను కాపాడడం లేదని విమర్శించారు. సభను నడిపించేది స్పీకరా? లేక ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. స్పీకర్ ఏకపక్ష వైఖరి విడనాడాలని, టీడీపీ శ్రేణులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు.