Hyderabad: ఇదిగో ఉద్యోగం అంటూ బిల్డప్పిచ్చి... యువతితో పరారైన మోసగాడు!

  • చిరు వ్యాపారిని నమ్మించి మోసం 
  • ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, కుమార్తె అపహరణ
  • కేసును విచారిస్తున్న పోలీసులు

కారులో తిరుగుతూ, ధనవంతుడిగా కలరిస్తూ, ఎటువంటి ఉద్యోగాన్నైనా సులభంగా ఇప్పిస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఓ మాయగాడు. చిరు వ్యాపారి కుమార్తెకు ఉద్యోగమిప్పిస్తానని చెప్పి, ఆమెను అపహరించుకుపోయాడు. హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వెనుక పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఓ చిరు వ్యాపారి వద్దకు ఈ నెల 23న ఏపీ 39 ఎక్యూ1686 నంబర్ గల కారులో వచ్చిన వ్యక్తి, తన పేరు శ్రీధర్‌ రెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. తన వారంతా ఉన్నతోద్యోగులని చెబుతూ నమ్మించాడు. తన పెద్ద కుమార్తెకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వ్యాపారి కోరగా, సరేనన్నాడు.

ఆపై సమీపంలో ఉన్న కుమార్తెను, కుమారుడిని అక్కడికి పిలిపించి, వారు ముగ్గురినీ కారు ఎక్కించుకుని, తొలుత ధ్రువపత్రాలు కావాలన్నాడు. అమ్మాయి చదివిన కాలేజీ వద్దకు తీసుకెళ్లాడు. సంబంధిత అధికారి అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు. తరువాత నగరంలోకి వచ్చారు. అందరికీ హోటల్‌ లో భోజనం పెట్టించాడు. అటూ ఇటూ తిప్పాడు. కాసేపటికి పని అవుతుందని చెబుతూ, వ్యాపారి కుమారుడిని బీఎన్‌ రెడ్డి నగర్‌ లో దింపాడు. హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ధ్రువపత్రాల జిరాక్సులు కావాలంటూ వ్యాపారితో చెప్పగా, అతను కారు దిగాడు. ఆ వెంటనే నిందితుడు యువతిని తీసుకుని కారులో పరారయ్యాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News