Telangana: తెలంగాణలో పెరగనున్న మద్యం దుకాణాలు.. అక్టోబరు ఒకటి నుంచి కొత్త విధానం
- సెప్టెంబరుతో ముగియనున్న పాత విధానం
- కొత్త మండలాల్లో కొత్తగా వైన్ షాపులు
- మండలానికి కనీసం ఒకటి ఉండేలా ఏర్పాటు
తెలంగాణలో 2017లో రూపొందించిన అబ్కారీ విధానం గడువు సెప్టెంబరుతో ముగిసిపోనుంది. దీంతో అక్టోబరు ఒకటో తేదీ నుంచి నూతన ఆబ్కారీ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం రెండేళ్లపాటు అమల్లో వుంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలకు మరిన్ని చేర్చబోతున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా మద్యం దుకాణాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంటే.. మండలంలో కనీసం ఒక మద్యం దుకాణమైనా ఉండేలా చూడనున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలతోపాటు 125 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో దాదాపు సగం మండలాల్లో మద్యం దుకాణాలు లేవు. దీంతో అక్కడున్న డిమాండ్‌ను బట్టి ఆయా మండలాల్లో కొత్త మద్యం షాపుల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంతోపాటు ప్రస్తుతం దుకాణాలు ఉన్న మండలాల్లో డిమాండ్‌ను బట్టి మరిన్ని షాపుల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆబ్కారీ అధికారులు యోచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2216 వైన్ దుకాణాలు, 670 బార్లు ఉన్నాయి.