BCCI: టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో ప్రపంచ దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్?
- ప్రపంచకప్‌తో ముగిసిన టీమిండియా కోచ్‌ల పదవీకాలం
- ప్రధాన కోచ్ పదవికి మహేల జయవర్ధనే దరఖాస్తు
- భారతదేశమంటే రోడ్స్‌కు చెప్పలేనంత అభిమానం
ప్రపంచ దిగ్జజ ఫీల్డర్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. 1992 నుంచి 2003 వరకు దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన రోడ్స్ 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం సొంత జట్టుకే ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కెన్యా జట్టుకు కూడా కోచ్ బాధ్యతలు నిర్వర్తించాడు.
టీమిండియా ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ల పదవీకాలం ప్రపంచకప్‌తో ముగియడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఈనెల 30. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే ప్రధాన కోచ్ పదవికి, జాంటీరోడ్స్ ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తున్నా అధికారికంగా ఎవరెవరు దరఖాస్తు చేశారు, ఎంతమంది చేశారు అన్న విషయాలు బయటకు రాలేదు.
కాగా, జయవర్ధనే, జాంటీరోడ్స్ ఇద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుకు పనిచేస్తుండడం గమనార్హం. ఇక, జాంటీరోడ్స్‌కు భారతదేశమంటే ఎంతో అభిమానం. ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలంటే ఎంతో ఇష్టపడే రోడ్స్ తన కుమార్తెకు ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడం విశేషం.