MiM: ఎక్కువ కాలం బతకనన్న బాధ కంటే బీజేపీ బలపడటమే నన్ను ఎక్కువ బాధిస్తోంది: అక్బరుద్దీన్ ఒవైసీ

  • ఎంత కాలం బతుకుతానో తెలియదు
  • నా బాధంతా కరీంనగర్ లో బీజేపీ బలపడటమే
  • ఎంఐఎం గెలవకపోయినా ఫర్వాలేదు.. బీజేపీని గెలిపించొద్దు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘నేను ఎక్కువ కాలం బతకనని డాక్టర్లు చెప్పారు. ఎంతకాలం బతుకుతానో తెలియదు. ఆ విషయంలో నాకు బాధ లేదు. నా బాధంతా కరీంనగర్ లో బీజేపీ బలపడటం. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం నాకు చాలా బాధ కలిగించింది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 తాను భయపడేది తన గురించి కాదని, రాబోయే తరాల గురించే అని అన్నారు. కరీంనగర్ లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్ గా ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీకి అడ్రసు కూడా లేదని, అలాంటిది, ఇప్పుడు, ఎంపీ స్థానాన్నే కైవసం చేసుకుందంటూ నిప్పులు చెరిగారు. ఎంఐఎం గెలవకపోయినా ఫర్వాలేదు కానీ, బీజేపీని మాత్రం గెలిపించొద్దని వ్యాఖ్యానించడం గమనార్హం.

మూకదాడుల అంశం గురించి అక్బరుద్దీన్ ప్రస్తావిస్తూ, ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు నేరుగా స్వర్గానికే వెళ్తారని, ఎవరైతే భయపడతారో వారినే భయపెట్టిస్తారని అన్నారు. మజ్లిస్ మతతత్వ పార్టీ అంటూ దుష్ప్రచారం చేస్తున్న వాళ్లు ఎవరో కాదని, గాడ్సేని పొగిడిన వాళ్లే అంటూ విమర్శించారు. 

MiM
Akbaruddin Owaisi
Mla
Bjp
karimnagar
  • Loading...

More Telugu News