Telangana: మా శాఖలో పనే లేదు.. మూసివేయాలి: తెలంగాణ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ వీకే సింగ్
- ఈ శాఖ ద్వారా ప్రభుత్వానికి నష్టం వస్తోంది
- పని చేసే వాళ్లు ఉన్నారు.. రెండు గంటలు మాత్రమే పని
- రాజీనామా చేస్తున్నానన్న వదంతులు కరెక్టు కాదు
రాజకీయాలతో ‘బంగారు తెలంగాణ’ రాదని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాలతో కాదు ప్రజల అవసరాలు తీరిస్తేనే ‘బంగారు తెలంగాణ’ వస్తుందని అన్నారు. ప్రస్తుతం స్టేషనరీ విభాగంలో పని లేదని, ప్రింటింగ్, స్టేషనరీ శాఖను మూసేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ శాఖ ద్వారా ప్రభుత్వానికి నష్టం వస్తోందని, అక్కడ పనిచేసే వాళ్లు ఉన్నప్పటికీ వారికి రోజుకు రెండు గంటలు మాత్రమే పని ఉంటోందని అన్నారు.
తెలంగాణ జైళ్ల శాఖలో డీజీగా పని చేసిన వీకే సింగ్ ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, తాను సెలవులో ఉండగా, ఈ శాఖకు తనను బదిలీ చేశారని అన్నారు. తనకు సరైన శాఖలో పోస్టింగ్ ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నానన్న వదంతులను ఆయన ఖండించారు. సరైన పోస్టింగ్ ఇవ్వకపోతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తానని అన్నారు.