Andhra Pradesh: జగన్ గారూ! మీ కసి నాకు నచ్చింది కానీ, ఎన్‌టీపీసీ వాళ్లకే నచ్చలేదనుకుంటా: నారా లోకేశ్ సెటైర్లు
- ‘మూర్ఖత్వం’ అసలు పేరు, ’అహంభావం’ ముద్దు పేరు
- జగన్ ని చూస్తుంటే, ఇది అక్షరాలా నిజం అనిపిస్తోంది
- గతంలో పీపీఏలు పారదర్శకంగా జరిగాయన్నా పట్టించుకోరే?
ఏపీలో గత ప్రభుత్వం హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగానే జరిగిన విషయాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు గుప్పించారు. ‘మూర్ఖత్వం’ అసలు పేరు, ’అహంభావం’ ముద్దు పేరు.. జగన్ ని చూస్తుంటే, ఇది అక్షరాలా నిజం అనిపిస్తోందని విమర్శించారు. విద్యుత్ ఒప్పందాలు పారదర్శకంగానే జరిగాయని, సమీక్ష వద్దని కేంద్రం, మేధావులు చెప్పినా జగన్ చెవికెక్కలేదని, ఓ కమిటీ వేసి, ఏదో చేసేద్దామని, లేని అవినీతిని నిరూపించాలని ఆయన కసిగా ఉన్నారని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
‘జగన్ గారూ! మీ కసి నాకు నచ్చింది. కానీ ఎన్‌టీపీసీ వాళ్ళకు నచ్చలేదనుకుంటా. అందుకే ఈ లెటర్ రాశారు’ అని, టీడీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలన్నీ పారదర్శకంగా జరిగాయని, నాటి మార్కెట్ ధరల కంటే తక్కువకే కొనుగోలు ధరలు నిర్ణయించామని, బిడ్ల ఎంపిక విధానాన్ని జాతీయ విద్యుత్తు నియంత్రణ మండలి కూడా ప్రశంసించిందని అందులో రాశారని లోకేశ్ పేర్కొన్నారు.
‘ఏంటో! మీ కసిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా కమిటీలు, సమీక్షలు అంటూ కాలయాపన చేయకుండా ఏపీలో కరెంటు కోతల మీద దృష్టిపెట్టండి. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టకండి’ అంటూ జగన్ కు చురకలంటిస్తూ లోకేశ్ సూచనలు చేశారు.