Adire Abhi: డైరెక్షన్ టీమ్ లోకి నన్ను తీసుకోమని ఈవీవీ గారినే అడిగేశాను: 'జబర్దస్త్' అదిరే అభి
- చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం
- 'నేటి గాంధీ' షూటింగ్ చూశాను
- చదువు పూర్తిచేయమని ఈవీవీ అన్నారు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్స్ లో 'అదిరే అభి' ఒకరు. ఒక వైపున బుల్లితెరపై సందడి చేస్తూనే, మరో వైపున వెండితెరపై నిలదొక్కుకోవడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, " చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. 'పసివాడి ప్రాణం' సినిమా చూసిన దగ్గర నుంచి ఆ ఇష్టం మరింత పెరిగిపోయింది.
నేను డిగ్రీ సెకండియర్ చదువుతుండగా, ఎల్.బి. స్టేడియంలో రాజశేఖర్ హీరోగా 'నేటి గాంధీ' షూటింగు జరుగుతోంది. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు ఒక సన్నివేశాన్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు. నేను నేరుగా ఆయన దగ్గరికి వెళ్లి, 'సార్ .. నేను డైరెక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నాను .. మీ టీమ్ లో పెట్టుకోండి' అని అడిగాను. 'ఇప్పటికే 24 మంది వున్నారు .. శ్రద్ధగా చదువుకో' అన్నారు. అక్కడే వున్న జనార్దన మహర్షి .. 'ముందు డిగ్రీ పూర్తి చేసి రా .. అప్పటి వరకూ సినిమాల గురించి ఆలోచించకు' అన్నారు. దాంతో నేను డిగ్రీ పూర్తయిన తరువాతనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను" అని చెప్పుకొచ్చాడు.