IAS: పార్లమెంటులో అమిత్ షాను కలిసిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి!
- తెలంగాణ క్యాడర్ లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీలక్ష్మి
- ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి
- తనను డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలంటూ అమిత్ షాకు విజ్ఞప్తి!
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఇవాళ పార్లమెంటులో కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. పార్లమెంటులో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తనను ఏపీకి డిప్యుటేషన్ పై పంపాలంటూ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఆమె పార్లమెంటు వద్ద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా కలిశారు. శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణ క్యాడర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ క్యాడర్ లో ఉన్న ఆమె ఏపీకి రావడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే సీఎం జగన్ ను కలిసి ఏపీలో పనిచేయడంపై ఆసక్తి చూపగా, జగన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీలక్ష్మి గతంలో ఓబుళాపురం గనుల వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లొచ్చారు. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యంపాలైన ఆమె, ఈ కేసు నుంచి విముక్తురాలైన తర్వాత మళ్లీ విధుల్లో కొనసాగుతున్నారు.