Uttar Pradesh: మరుగుదొడ్లు శుభ్రం చేయమన్న వార్డెన్.. రెసిడెన్షియల్ స్కూలు నుంచి పారిపోయిన ఆరుగురు విద్యార్థినులు
- బారాబంకిలోని కస్తూర్బా పాఠశాలలో ఘటన
- వార్డెన్, స్కూలు యాజమాన్యంపై బాలికలు తీవ్ర ఆరోపణ
- ఆరోపణలు నిజమైతే చర్యలు తప్పవంటూ వార్డెన్‌కు అధికారుల హెచ్చరిక
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఉన్న కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థినులు పరారయ్యారు. వారి కోసం గాలించి చివరికి సమీప గ్రామంలో పట్టుకున్న అధికారులు తిరిగి స్కూల్లో అప్పగించారు. మరుగుదొడ్లు, వంటపాత్రలు శుభ్రం చేయాలంటూ వార్డెన్ తమను హింసిస్తున్నందుకే వెళ్లిపోయామని బాలికలు తెలిపారు. ఈ ఆరోపణలను వార్డెన్, స్కూలు యాజమాన్యం ఖండించింది. హోం సిక్ కారణంగానే వారు పారిపోయారని, వారితో తాము పనులు చేయించుకోవడం లేదని వార్డెన్ వివరణ ఇచ్చారు.
పాఠశాల నుంచి బాలికలు పరారయ్యారన్న వార్త బయటకొచ్చిన వెంటనే జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. బాలికలను వెతికి పట్టుకోవాలంటూ బ్లాక్ శిక్ష అధికారికి ఆదేశాలు వెళ్లాయి. కాగా, స్కూలు యాజమాన్యంపై బాలికలు పలు ఆరోపణలు చేశారు. బట్టలు ఉతకడం, మరుగుదొడ్లు, పాత్రలు శుభ్రం చేయడం వంటి పనులను తమతో చేయించుకుంటున్నారని తెలిపారు.
స్కూలు ఆవరణలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించిన బ్లాక్ అధికారి.. బాలికలు స్కూలు నుంచి బయటకు వచ్చి టెంపో ఎక్కి సమీప గ్రామంలో ఉండే తమ స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. కాగా, బాలికలతో బలవంతంగా పనులు చేయించినట్టు తేలితే వార్డెన్, స్కూలు అధికారులపై చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.