Karnataka: కొనసాగుతున్న వాయిదాల పర్వం.. కుమారస్వామికి మరో డెడ్‌లైన్ విధించిన కర్ణాటక స్పీకర్
- నేటికి వాయిదా పడిన సభ
- తాను రాజీనామా చేస్తానని హెచ్చరించిన స్పీకర్
- నేటి సాయంత్రం 6 గంటలకు ముగియనున్న డెడ్‌లైన్
నెల రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న కర్ణాటక రాజకీయాలు యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ బలనిరూపణకు స్పీకర్ రమేశ్ కుమార్ సోమవారం రాత్రి 9 గంటల వరకు విధించిన గడువు కూడా ముగిసినా ఓటింగ్ జరగకుండానే సభ వాయిదా పడింది. దీంతో నేటి సాయంత్రం 6 గంటల వరకు స్పీకర్ మరో డెడ్‌లైన్ విధించారు. ఆ లోపు కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు.
కాగా, సోమవారం ఉదయం నుంచి అసెంబ్లీలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీ వ్యతిరేకించినప్పటికీ స్పీకర్ మాత్రం అధికార పక్షానికి మాట్లాడేందుకు పదేపదే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్పీకర్‌తో కుమారస్వామి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బలపరీక్షకు రాత్రి 9 గంటల వరకు సీఎంకు స్పీకర్ సమయం ఇచ్చారు.
సుప్రీంకోర్టులో తమ పిటిషన్ పెండింగులో ఉన్నందున మరింత సమయం ఇవ్వాలని కోరినా స్పీకర్ నిరాకరించారు. బలపరీక్షకు సిద్ధం కాకపోతే తాను రాజీనామా చేస్తానని కూడా స్పీకర్ హెచ్చరించారు. కాగా, సోమవారం రాత్రి వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ అదే గందరగోళం నెలకొంది. దీంతో ఓటింగ్ జరగకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నేటి సాయంత్రం ఆరు గంటల లోపు తన బలాన్ని నిరూపించుకోవాలని కుమారస్వామికి డెడ్‌లైన్ విధించారు.