Yanamala: అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వకపోవడానికి కారణం ఇదే: యనమల
- అమరావతిపై ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు అందాయి
- విచారణ జరుపుతామని ప్రపంచ బ్యాంకు కోరితే కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది
- వరల్డ్ బ్యాంక్ రుణాలను కేంద్రం అడ్డుకోలేదు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వలేమంటూ ప్రపంచ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల స్పందించారు. వరల్డ్ బ్యాంక్ రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదని ఆయన అన్నారు. అమరావతిపై కొందరు ఫిర్యాదు చేశారని... ఆ ఫిర్యాదుపై విచారణ జరుపుతామని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు కోరిందని తెలిపారు. దేశం వెలుపల ఉన్న సంస్థ ఇక్కడ ఎలా విచారణ జరుపుతుందని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ కారణం వల్లే అమరావతికి నిధులు ఇచ్చే అంశంలో ప్రపంచ బ్యాంకు వెనకడుగు వేసిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని... ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించేవారని యనమల అన్నారు. 2013 చట్టమే పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పెరగడానికి కారణమని చెప్పారు. రానున్న రోజుల్లో భూసేకరణ జరపడం చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.