Karnataka: కర్ణాటకం...బలపరీక్షకు వేళాయే: మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం
- స్పష్టం చేసిన స్పీకర్ రమేష్‌కుమార్
- రెండు రోజులు వాయిదావేయాలన్న సీఎం అభ్యర్థనకు నో
- రాత్రయినా సభ కొనసాగించే అవకాశం
రకరకాల మలుపులు తిరుగుతూ, రోజుకో ట్విస్ట్‌తో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారయింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బలపరీక్ష జరుగుతుందని స్పీకర్ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేలను రప్పించే ప్రయత్నం జరుగుతోందని, అందువల్ల రెండు రోజులపాటు బలపరీక్ష వాయిదా వేయాలన్న సీఎం కుమారస్వామి అభ్యర్థనను స్పీకర్ తోసిపుచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈరోజు బలపరీక్ష ఉంటుందని, చర్చ ముగిసిన అనంతరం ఓటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు చర్చ మొదలుపెట్టి అవసరమైతే రాత్రయినా బలపరీక్ష పూర్తిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బలపరీక్ష ఈరోజు జరపాలని స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్, అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యాన్ని నిరసిస్తూ సీఎం దాఖలు చేసిన పిటిషన్, విప్ అంశంలో క్లారిటీ లేదని కాంగ్రెస్‌నేత సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌లు సుప్రీంకోర్టులో రేపు విచారణకు రానున్నాయి.