assembly: రేషన్ డీలర్లను తొలగించే ప్రసక్తి లేదు: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
- డీలర్లే స్టాకిస్టులుగా సేవలందిస్తారు
- వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక కార్డులపై సమీక్ష
- అర్హులైన వారికి త్వరలో కొత్త కార్డులు
రేషన్ డీలర్లను తొలగించాలన్న ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కొత్త విధానం అమల్లోకి వచ్చినా స్టాకిస్టులుగా డీలర్లే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో టీడీపీ కార్యకర్తలకే దొడ్డిదారిన రేషన్ షాపులు అప్పగించారని, ఇలా దొడ్డిదారిన షాపులు దక్కించుకున్న వారిని మాత్రం తొలగిస్తామని స్పష్టం చేశారు.
వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక రేషన్ కార్డులపై సమీక్ష చేస్తామన్నారు. అర్హులైన వారికి త్వరలోనే కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. చాలామంది రేషన్ డీలర్లు బీపీఎల్ లబ్ధిదారుల కార్డులు తమ వద్దే ఉంచుకుని సరుకుకు లెక్కచూపిస్తున్నారని, దీనిపై దృష్టిసారిస్తామన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా కార్డులు ఇచ్చే ఆలోచన ఉందని నాని సభకు వివరించారు.