engineer: కాంగ్రెస్ అధ్యక్ష పోస్టుపై కన్నేసిన 28 ఏళ్ల పూణె ఇంజినీర్!
- రేపు నామినేషన్ సమర్పించున్న గజానంద్
- పార్టీకి యువ నాయకత్వం అవసరమని వ్యాఖ్య
- రాజకీయాల్లో అనుభవం శూన్యం
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటి నుంచీ ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఆ పదవిని అధిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రాహుల్ గాంధీనే కొనసాగాలన్న డిమాండ్ పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పూణెకు చెందిన 28 ఏళ్ల ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ గజానంద్ హోసాలే ఆ పోస్టుపై కన్నేశాడు. ఓ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న గజానంద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించాడు. ఈ మేరకు రేపు నగర అధ్యక్షుడి రమేశ్ బగ్వేకి తన దరఖాస్తును ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నాడు.
రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ డైలమాలో పడిపోయిందని, ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై పార్టీలో గందరగోళం ఉందని గజానంద్ పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆ పోస్టు కోసం నామినేషన్ వేయాలని అనిపించిందని పేర్కొన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు యువ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డాడు. రాహుల్ గాంధీ యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న గజానంద్.. వయసులో చిన్నవాళ్లు అయినంత మాత్రాన సరిపోదని, ఆలోచనా విధానం కూడా బాగుండాలని పేర్కొన్నాడు. కాగా, పార్టీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న గజానంద్‌కు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో తనకు కనీసం సభ్యత్వం కూడా లేదని తెలిపాడు.