chandrayaan: నేడే 'చంద్రయాన్ 2' పయనం.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచం!

  • సాంకేతిక కారణాలతో ఓసారి వాయిదా పడిన ప్రయోగం
  •  లాంచ్ విండో వ్యవధి నిమిషమే
  • సవాలును స్వీకరించిన ఇస్రో శాస్త్రవేత్తలు

సాంకేతిక కారణాలతో వాయిదాపడిన చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ శుభ ఘడియ కోసం దేశ ప్రజలే కాదు.. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మధ్యాహ్నం 2:43 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 6:43 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ నిరాటంకంగా సాగుతోంది. 3.8 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 నిర్ణీత కక్ష్యలో వదిలిపెట్టేందుకు రెడీ అయింది.

నిజానికీ ప్రయోగం ఈ నెల 15నే జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో రాకెట్ క్రయోజెనిక్ ట్యాంకర్‌లో లోపాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగానికి 56 నిమిషాల ముందు కౌంట్‌డౌన్‌‌ను ఆపేసి ప్రయోగాన్ని నిలిపేశారు. ఆ తర్వాత లోపాలను సరిదిద్ది ప్రయోగానికి సిద్ధం చేశారు.  

కొన్నాళ్ల పయనం తర్వాత చంద్రుడిపై దిగనున్న ల్యాండర్ నుంచి దిగే రోవర్ సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజులు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి ఆ సమాచారంతోపాటు అక్కడి ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపిస్తుంది. ముఖ్యంగా చంద్రుడిపై నీటి ఆనవాళ్ల గురించి పరిశోధిస్తుంది. అలాగే, ఖనిజాలు, రాతి నిర్మాణాలపైనా పరిశోధనలు చేస్తుంది.

నిజానికి ఈ ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తలకు సవాలుతో కూడుకున్నదేనని చెప్పాలి. ఈ నెల 15న పది నిమిషాల లాంచ్ విండో లభ్యం కాగా, నేటి లాంచ్ విండో సమయం నిమిషమే వుంది. అయినప్పటికీ సవాలుగా తీసుకున్న శాస్త్రవేత్తలు అతి తక్కువ నిడివిలోనే ప్రయోగానికి సిద్ధమయ్యారు. ప్రయోగాన్ని విజయవంతం చేస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News