Warangal Urban District: అర్ధరాత్రి వేళ రైలు నుంచి కిందపడిన యువకుడు.. సాహసం చేసి ప్రాణాలు దక్కించుకున్న వైనం!
- యూపీ నుంచి నెల్లూరు వెళ్తున్న వ్యక్తి
- వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
- స్టేషన్ మాస్టర్ చొరవతో నిలిచిన ప్రాణం
కూలి పనుల కోసం రైలులో నెల్లూరు వెళ్తున్న ఓ వ్యక్తి అర్ధ రాత్రి వేళ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. పొట్ట చిట్లి చిన్న పేగులు బయటకొచ్చాయి. రక్తం కారుతోంది. కళ్లు పొడుచుకున్నా కనిపించని చిమ్మ చీకటి. సాయం కోసం అటూఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఇక లాభం లేదనుకుని పేగులను బలవంతంగా లోపలికి నెట్టాడు. చొక్కా విప్పి గాయమైన చోట గట్టిగా కట్టాడు. ఆ గాడాంధకారంలోనే పట్టాలపై నడకసాగించాడు. కాసేపటికి ఏదో స్టేషన్ కనిపించింది. స్టేషన్ మాస్టర్ సాయంతో ఆసుపత్రికి చేరి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని హుసేనాబాద్‌కు చెందిన సునీల్ చౌహాన్ (38) కూలి పనుల కోసం సోదరుడు ప్రవీణ్ చౌహాన్‌తో కలిసి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నాడు. అర్ధరాత్రి దాటి రెండు గంటల సమయంలో రైలు వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ దాటుతోంది. సునీల్ బాత్రూం కోసం వచ్చి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. రైలు వేగంగా వెళ్తుండడంతో కింద ఉన్న సూదిమొనల్లాంటి రాళ్లు తగిలి పొట్ట కోసుకుపోయింది. చిన్నపేగులు బయటకు వచ్చాయి.
కాసేపటికి కానీ సునీల్‌కు తానెక్కడున్నదీ తెలియలేదు. చూట్టూ చిమ్మ చీకటి. పేగులు బయటకు వచ్చి పరిస్థితి దారుణంగా ఉంది. సాయం కోసం చూసినా ఫలితం లేకుండా పోయింది. ఫోన్ చేద్దామంటే ఎక్కడో ఎగిరిపడింది. దీంతో బయటకు వచ్చిన పేగును లోపలికి తోసి మళ్లీ అవి బయటకు రాకుండా చొక్కా కట్టి పట్టాలపై నడక ప్రారంభించాడు. అలా 11 కిలోమీటర్ల దూరం నడిచి హసన్‌పర్తి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అతడిని చూసిన స్టేషన్ మాస్టర్ వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి సునీల్‌కు శస్త్రచికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది.