Karnataka: కర్ణాటక శాసనసభలో రేపు ఓటింగ్ కు వెళ్లే అవకాశం లేదు: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావు
- రేపు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష
- సుప్రీం కోర్టు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని చెప్పిన గుండూరావు
- సుప్రీం ఆదేశాలను బట్టే తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్న కేపీసీసీ చీఫ్
కర్ణాటక రాజకీయ సంక్షోభం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. రేపు విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, కర్ణాటక కాంగ్రెస్ మాత్రం ఓటింగ్ కు వెళ్లే ఉద్దేశం లేదంటోంది.
దీనిపై కర్ణాటక కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాట్లాడుతూ, తాము సుప్రీం కోర్టు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ వెల్లడించారు. సుప్రీం నిర్ణయం రానంతవరకు తాము శాసనసభలో ఓటింగ్ లో పాల్గొనలేమని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని గుండూరావు తెలిపారు. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. కర్ణాటక రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత దినేశ్ గుండూరావు పైవ్యాఖ్యలు చేశారు.