Kumara Dharmasena: వరల్డ్ కప్ ఫైనల్లో చేసిన తప్పును ఒప్పుకున్న అంపైర్ ధర్మసేన
- ఓవర్ త్రోకు 6 పరుగులు ఇచ్చిన ధర్మసేన
- ఇవ్వాల్సింది 5 పరుగులేనని రీప్లేలో తేలిన వైనం
- విచారం వ్యక్తం చేసిన శ్రీలంక అంపైర్
లార్డ్స్ మైదానంలో రోమాంఛకంగా సాగిన వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ఇంగ్లాండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో బెన్ స్టోక్స్ పరుగు తీస్తుండగా కివీస్ ఫీల్డర్ విసిరిన బంతి అతడి బ్యాట్ కు తగిలి బౌండరీ లైన్ తాకింది. దాంతో శ్రీలంక అంపైర్ కుమార ధర్మసేన ఓవర్ త్రోతో కలిపి మొత్తం 6 పరుగులు ఇచ్చేశాడు. వాస్తవానికి ఇక్కడ ఇంగ్లాండ్ 5 పరుగులే వస్తాయి. కానీ, స్టోక్స్ రెండు పరుగులు పూర్తిచేశాడని భావించిన అంపైర్ ధర్మసేన వాటికి మరో 4 పరుగులు కలిపి 6 పరుగులు ఇచ్చేశాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
అంపైర్ తప్పు చేశాడంటూ ధర్మసేనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్రమైంది. మాజీ క్రికెటర్లు కూడా ఇది ముమ్మాటికీ తప్పేనని ధర్మసేనపై విరుచుకుపడ్డారు. ఫైనల్ ముగిసిన ఇన్నాళ్లకు తాను చేసింది తప్పేనని ధర్మసేన అంగీకరించాడు.
"మ్యాచ్ ముగిసిన తర్వాత రీప్లేలో చూసిన తర్వాత కానీ నేను చేసింది తప్పేనని అర్థమైంది. ఇప్పుడు నేను క్షమాపణలు చెప్పినా ఉపయోగం ఉండదేమో. ఆ సమయంలో మరో అంపైర్ ఎరాస్మస్ తో చర్చించాను కూడా. మ్యాచ్ అధికారులు కూడా టీవీ రీప్లే వెంటనే చూడకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది" అంటూ విచారం వ్యక్తం చేశాడు.
కాగా, ధర్మసేన దానం చేసిన ఆ ఒక్క అదనపు పరుగే మ్యాచ్ విజేతను నిర్ణయించింది. ఫైనల్లో స్కోర్లు సమం కాగా, సూపర్ ఓవర్ కూడా అదే రీతిలో ముగిసింది. దాంతో ఇంగ్లాండ్ ను అత్యధిక బౌండరీల ఆధారంగా విజేతగా ప్రకటించారు.