Vizag: విశాఖ ఏజెన్సీలో హృదాయ విదారకం.. దుప్పటిని డోలిలా కట్టి నిండు గర్భిణీని మోసుకెళ్లిన గ్రామస్తులు!
- వి.మాడుగల మండలంలోని కొత్త వలసలో ఘటన
- రోడ్లు, వైద్య సౌకర్యం లేక అవస్థలు
- పదిహేను కిలోమీటర్లు డోలిని మోసుకెళ్లిన వైనం
దేశంలో రోడ్లు లేని, వైద్యం అందని గ్రామాలు చాలానే ఉన్నాయి. గ్రామస్తులు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లి ఆసుపత్రిలో చూపించుకునే పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయి. ఇందుకు నిదర్శనం ఏపీ, విశాఖపట్టణం జిల్లాలోని వి.మాడుగల మండలంలోని కొత్త వలస. నిండు గర్భిణి జానపరెడ్డిదేవీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. దీంతో, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్తులు నానా పాట్లు పడాల్సి వచ్చింది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అక్కడికి వాహనాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కర్రకు ఓ దుప్పటి కట్టి డోలిలా మార్చారు. అందులో, ఆమెను పడుకోబెట్టి మోసుకుంటూ తీసుకెళ్లారు.
సుమారు పదిహేను కిలోమీటర్ల మేరకు ఆమెను డోలిలో అలా మోసుకెళ్లారు. దారి మధ్యలో వర్షం పడినా, బురద ఉన్నా అలానే ముందుకు కదిలారు. ఎంతో కష్టపడి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు.ఇదిలా ఉండగా, ఈ కథనం మీడియాలో ప్రసారం కావడంతో కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.