New Delhi: మ్యాక్స్ ఆసుపత్రి డాక్టర్ల పెద్దమనసు.. చిన్నారి ఆపరేషన్ కోసం రూ.11 లక్షల సేకరణ!
- లివర్ సమస్యతో ఆసుపత్రిలో చేరిన హమ్జా
- ఆపరేషన్ కు రూ.15 లక్షలు ఫీజు
- విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేసిన డాక్టర్లు
కార్పొరేట్ ఆసుపత్రులంటే దోపిడీకి అడ్డాలని చాలామంది భావిస్తారు. భారీ చార్జీలు, వందల పరీక్షలతో జేబులు గుల్ల చేసేస్తారని ఈ ఆసుపత్రులపై సామాన్యుల్లో ఓ అభిప్రాయం ఉంది. అయితే ఢిల్లీలోని మాక్స్ ఆసుపత్రి మాత్రం డబ్బుల కంటే ప్రాణాలకే ఎక్కువ విలువ ఇచ్చింది. ఓ బాలుడికి లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం సొంతంగా రూ.11 లక్షలు సమకూర్చింది.
ఢిల్లీకి చెందిన అలీ హమ్జా(7) అనే బాలుడికి లివర్ సమస్య వచ్చింది. ఈ సమస్యతో పిల్లాడి లివర్ చెడిపోయి మాటిమాటికీ స్పృహ కోల్పోయేవాడు. ఈ నేపథ్యంలో పిల్లాడిని పరీక్షించిన వైద్యులు లివర్ పూర్తిగా చెడిపోయిందనీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్ కు రూ.15 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అయితే తాము పేదవాళ్లమనీ, అంత డబ్బు తమ దగ్గర లేదని బాలుడి తల్లిదండ్రులు బాధపడ్డారు. మరో ఆసుపత్రి అయితే చేతులు ఎత్తేసేవారే. కానీ మ్యాక్స్ ఆసుపత్రి వైద్యులు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
బాలుడి ఆపరేషన్ కోసం తమకు తెలిసిన సంస్థలు, వ్యక్తుల నుంచి రూ.11 లక్షలు సేకరించారు. బాధిత కుటుంబం మరో రూ.3 లక్షలు పెట్టుకుంది. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు హమ్జా తండ్రి రేహాన్ లివర్ లో కొంతభాగాన్ని కుమారుడికి అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయిందనీ, హమ్జా క్రమంగా కోలుకుంటున్నాడని ఆపరేషన్ నిర్వహించిన డా.శరత్ వర్మ తెలిపారు. కాగా, మ్యాక్స్ ఆసుపత్రి వైద్యులు తీసుకున్న చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.