Peddapalli District: తప్పిపోయిన 22 ఏళ్ల తర్వాత తల్లి ఒడిని చేరిన కొడుకు

  • ఉబ్బితబ్బిబ్బయిన మాతృమూర్తి
  • మతిస్థిమితం లేక కేరళ వెళ్లిపోయిన బాధితుడు
  • ఇన్నేళ్ల తర్వాత కోలుకోవడంతో ఇంటికి చేర్చిన అక్కడి వారు

మతిస్థిమితం సరిగా లేక ఇరవై రెండేళ్ల క్రితం ఎటో వెళ్లిపోయిన బిడ్డ ఇన్నేళ్ల తర్వాత కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లి ఆనందం ఎలావుంటుంది. సరిగ్గా అటువంటి ఆనందమే సొంతమయ్యింది తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా జూపల్లి మండలం వడకపూర్‌ గ్రామానికి చెందిన కుడ్రాజు రాజమ్మకు నలుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. అందరి కంటే పెద్దవాడు నంబయ్య. పెళ్లయినా భర్త మానసిక స్థితి సరిగా లేదని నంబయ్య భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తల్లితోపాటు ఉన్న నంబయ్య ఓ రోజు సమీపంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లి దొరికిన రైలు ఎక్కేశాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి కేరళ రాష్ట్రం చేరాడు.

మూడేళ్ల క్రితం అక్కడి తెలుగువారు నంబయ్యను గుర్తించారు. అతని మానసిక స్థితి సరిగా లేదని గమనించి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కోలుకున్నాక వివరాలు తెలుసుకున్నారు. ఊరు పేరు చెప్పడంతో రెండు రోజుల క్రితం బెల్లంపల్లి పట్టణంలోని మహ్మద్‌ఖాసిం బస్తీకి తీసుకువచ్చారు. అనంతరం తల్లి రాజమ్మను రప్పించి కొడుకును చూపించారు. 22 ఏళ్ల తరువాత కొడుకు కనిపించడంతో రాజమ్మ భావోద్వేగానికి గురయ్యింది. కన్నీటి పర్యంతమవుతూ అక్కున చేర్చుకుంది.

ఎటో వెళ్లిపోయిన కొడుకు ఇన్నేళ్లయినా ఆచూకీ లేకపోవడంతో చనిపోయి ఉంటాడని భావించామని, తిరిగి వస్తాడని కలలో కూడా ఊహించలేదని ఆమె అంది. స్థానికులు కూడా నంబయ్యను చూసి ఆశ్చర్యపోయారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తమలో చాలామంది పేర్లు నంబయ్య చెప్పడంతో పట్టరానంత ఆనందానికి లోనయ్యారు. ఆప్యాయంగా పలకరిస్తూ అతన్ని తమ వాడిగా మార్చుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News