Rains: నేడు, రేపు అక్కడక్కడా అతి భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలకు చాన్స్!
- నిన్న పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్న అధికారులు
నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో, నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని తెలిపిన అధికారులు, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్, కర్నూలు, పశ్చిమ గోదావరి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయని తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. కాగా, వచ్చే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.