Guangzhou: చైనాలో ‘దోమలపై దండయాత్ర’.. ఓ దోమ జాతిని తుడిచిపెట్టేసిన ప్రొఫెసర్!
- చైనాలోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్సులో ఘటన
- దోమల నియంత్రణకు బ్యాక్టీరియాను వాడిన శాస్త్రవేత్తలు
- గణనీయంగా తగ్గిపోయిన దోమల సంతతి
విషానికి విషమే విరుగుడు, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నదానిని చైనా శాస్త్రవేత్త ఒకరు కొంచెం సీరియస్ గా తీసుకున్నారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, జికా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తున్న దోమలను అరికట్టేందుకు వాటిపైకి దోమలనే ప్రయోగించి విజయం సాధించారు. చైనాలోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్సుకు చెందిన ప్రొఫెసర్ జీ జియాంగ్ ప్రస్తుతం సన్ యెట్ సేన్ విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. పరిశోధనలో భాగంగా ఆయన నేతృత్వంలోని నిపుణుల బృందం 10 లక్షల మగ దోమలను నగరంలోకి వదిలిపెట్టింది. ఈ దోమల్లో ‘వాల్బాచియా’ అనే బ్యాక్టీరియాను జొప్పించారు.
ఈ బ్యాక్టీరియా ఉన్న జీవులు మనుషులను కుట్టవు. అంతేకాకుండా ఈ మగ దోమలతో కలిశాక ఆడ దోమలు పెట్టిన గుడ్లు ఫలదీకరణం చెందవు. ఈ ప్రయోగం కారణంగా గత రెండేళ్లలో ప్రావిన్సులోని దోమల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. కాగా, ప్రొఫెసర్ జీ జియాంగ్ ప్రయోగం కారణంగా రెండేళ్ల కాలంలో గ్యాంగ్ డాంగ్ ప్రావిన్సులో ఓ జాతి దోమలు పూర్తిగా అంతర్థానమైపోయాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్ జియాంగ్ కొందరు అమెరికా పరిశోధకులతో కలిసి 2016 నుంచి ఈ ప్రయోగాలు చేపట్టినట్లు పేర్కొన్నాయి. కాగా, ఈ ప్రయోగం విజయవంతమైతే దోమల ద్వారా వ్యాపించే అంటు వ్యాధులకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చనీ, పంటలకు చీడ పట్టకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దోమల నియంత్రణకు వాడుతున్న రసాయనాల వాడకం కూడా గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.