Andhra Pradesh: కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం షెడ్యూల్ వివరించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
- ఈ నెల 24న నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం
- ముస్తాబవుతున్న రాజ్ భవన్
- ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్
ఏపీ నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితుడైన సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీన ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాజ్ భవన్ ముస్తాబవుతుండగా, ప్రమాణస్వీకార ఏర్పాట్లను రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఈ నెల 23న గవర్నర్ బిశ్వభూషణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, అదే రోజు సాయంత్రం విజయవాడ చేరుకుంటారని తెలిపారు. ఎయిర్ పోర్టులో గవర్నర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారని వివరించారు.
తొలిసారిగా గవర్నర్ రాష్ట్రానికి వస్తున్నందున సైనిక వందనం ఉంటుందని, ఆపై ఆయన బెజవాడ దుర్గమ్మను దర్శించుకుంటారని సీఎస్ పేర్కొన్నారు. 23వ తేదీ రాత్రికి ఆయన రాజ్ భవన్ లో బస చేస్తారని, ఆ మరుసటి రోజున అధికారికంగా గవర్నర్ పదవీ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఇతర ఆహ్వానితులకు టీ పార్టీ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు. ఇక, సోమవారం నాటికి గవర్నర్ అధికారిక నివాసం పనులు పూర్తవుతాయని, డీజీపీ సూచనలతో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.