blue whale: బ్లూవేల్ కు పోటీగా మరో భూతం.. మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు!
- కొత్త ఆన్ లైన్ గేమ్ కు బానిసైన దివాకర్
- టాస్కులు పూర్తిచేస్తూ చివరికి ఆత్మహత్య
- గేమ్ పేరును బయటపెట్టని పోలీసులు
కొన్నిరోజుల క్రితం ఆన్ లైన్ లో వచ్చిన ‘బ్లూవేల్ గేమ్’ కారణంగా చాలామంది టినేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. తొలుత చిన్నచిన్న టాస్కులు ఇస్తూ ఆటకు బానిస అయ్యేలా చేసి చివరకు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం బ్లూవేల్ ప్రత్యేకత. తాజాగా ఇదే తరహాలో మరో గేమ్ ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన దివాకర్ మాలే(20) ఆన్ లైన్ గేమ్స్ ఆడేవాడు. అయితే ఇటీవల కొత్త ఆటను ఆడటం మొదలుపెట్టిన మాలే ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది.
దీంతో చదువుకోవాలనీ, ఆన్ లైన్ గేమ్స్ ఆడటం ఆపాలని తల్లిదండ్రులు కుమారుడిని కోరారు. అయితే వీటిని పట్టించుకోకుండా అతను గేమ్స్ ఆడటం ప్రారంభించాడు. ఈరోజు ఉదయం 8 గంటలైనా మాలే తన గదినుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు బలవంతంగా తలుపులు తీశారు. అప్పటికే ఫ్యానుకు ఉరివేసుకుని నిర్జీవంగా వేలాడుతున్న మాలేను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, ఈ ప్రమాదకరమైన గేమ్ మరింత వ్యాప్తి చెందకూడదన్న ఉద్దేశంతో పోలీసులు దాని పేరును బయటపెట్టలేదు.