Donald Trump: ఇది మా అమెరికా కాదు.. మీ అమెరికా కాదు.. అందరిదీ!: ట్రంప్ పై మిషెల్ ఒబామా ఫైర్
- ఇది మనందరి అమెరికా
- ఇక్కడున్నవారంతా అమెరికన్లే
- భిన్నత్వంలో ఏకత్వమే అమెరికా గొప్పదనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ నిప్పులు చెరిగారు. మైనార్టీ జాతికి చెందిన నలుగురు మహిళా కాంగ్రెస్ సభ్యుల పట్ల ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. 'ఇది మా అమెరికా, మీ అమెరికా కాదు. మనందరి అమెరికా' అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రతి ఒక్కరికీ చోటు ఉంటుందని చెప్పారు. మనం ఇక్కడే పుట్టినా, లేక ఇక్కడ నివసిస్తున్నా... ఇక్కడున్నవారంతా అమెరికన్లేనని అన్నారు. అమెరికాకు ఉన్న భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పదనాన్ని చాటుతోందని తెలిపారు. అయితే, ట్రంప్ పేరును నేరుగా పేర్కొనకుండా ట్విట్టర్ ద్వారా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
నలుగురు డెమోక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యులపై ట్రంప్ మండిపడ్డారు. అమెరికాలో మీరు సంతోషంగా లేకపోతే... మీరు పుట్టిన స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాతి వివక్ష వ్యాఖ్యలంటూ ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నలుగురిలో ఒకరైన ఇల్హన్ ఒమర్ మాట్లాడుతూ, సోమాలియా నుంచి వచ్చిన మహిళ ఎదగడాన్ని ట్రంప్ భరించలేకపోతున్నారని మండిపడ్డారు. ట్రంప్ నిర్ణయాలతో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని... ట్రంప్ కూడా నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తామని హెచ్చరించారు.