Andhra Pradesh: కర్నూలులో దారుణం.. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య!
- కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో ఘటన
- విషపు గుళికలు మింగిన రైతు లక్ష్మారెడ్డి
- ఆసుపత్రికి తరలించేలోపే మృతి
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. అప్పులవాళ్ల బాధ తాళలేక ఓ రైతు విషపు గుళికలు తిని ప్రాణాలు వదిలాడు. ఆదోని మండలం సంతెకొడ్లూరు గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి వ్యవసాయం చేసేందుకు బ్యాంకుతో పాటు చాలామంది దగ్గర అప్పులు తీసుకున్నాడు. అయితే వ్యవసాయంలో నష్టాలు రావడం, నిర్ణీత గడువులోగా వాటిని చెల్లించకపోవడంతో వడ్డీ భారీగా పెరిగిపోయింది. తమ అప్పు తిరిగి చెల్లించాలని పలువురు లక్ష్మారెడ్డిని డిమాండ్ చేశారు.
దీంతో తనవల్లే కుటుంబానికి ఈ ఇబ్బందులు వచ్చాయని మనస్తాపం చెందిన లక్ష్మారెడ్డి, ఈరోజు ఉదయం పొలం వద్దకు వచ్చాడు. అక్కడే కూర్చుని విషపు గుళికలను మింగాడు. నురగలు కక్కుకుంటూ పడిపోయిన లక్ష్మారెడ్డిని చుట్టుపక్కల రైతులు గమనించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో లక్ష్మారెడ్డి కుటుంబంతో పాటు సంతెకొడ్లూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.