hevyrains: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు
- నైరుతి రుతుపవనాల విస్తరణ ప్రభావం
- ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం
- అక్కడక్కడా జనజీవనానికి కాస్త ఇబ్బందులు
ఎల్నినో ప్రభావంతో ఇన్నాళ్లు ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు ఆలస్యంగానైనా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో నవ్యాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. సాధారణంగా జూలై 15 నాటికే నైరుతి ప్రభావం అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యమైందని వాతవరణ శాఖ తెలిపింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. జెండా వీధి, సీపీఐ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. గుత్తి పట్టణంలో పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మురుగునీరు రోడ్డుపైకి వచ్చి అనంతరం ఇళ్లలోకి చేరింది.
గుంటూరు జిల్లా బాపట్ల, కర్లపాలెం, పిట్టలవాని పాలెం మండలాల్లో తెల్లవారు జాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాలు సాగుకు ఉపయుక్తమని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తోడు ఉరుములు,మెరుపులు తోడవ్వడంతో అధికారులు ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండు పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు నీళ్లు నిలిచిపోవడంతో వాహనచోదకులకు పాట్లు తప్పలేదు.
ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం, పరుచూరు, మార్టూరు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. యద్దనపూడి మండలం యనమదలలో ఉప్పువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి పరుచూరు వాగు ఉరకలేస్తోంది. వర్షం ధాటికి మార్టూరు మండలం పలపర్రులో పెంకుటిల్లు కూలిపోయింది. చినగంజాంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.