Karnataka: గవర్నర్ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కుమారస్వామి
- బలనిరూపణపై గవర్నర్ డెడ్ లైన్ తగదు
- ఇది రాజ్యాంగ విరుద్ధం: కుమారస్వామి
- ‘సుప్రీం’లో మరో పిటిషన్ వేసిన దినేశ్ గుండూ రావు
ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోపు మెజారిటీ నిరూపించుకోవాలని కర్ణాటకలోని సంకీర్ణ సర్కారుకు గవర్నర్ వాజుభాయ్ వాలా ఇచ్చిన గడువు దాటిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి చొరవ తీసుకున్న గవర్నర్, సీఎం కుమారస్వామికి మళ్లీ లేఖ రాశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు బలనిరూపణ చేసుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కుమారస్వామి ఆశ్రయించారు. సభలో బలనిరూపణ చేసుకోవాలంటూ గవర్నర్ డెడ్ లైన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో విప్ పై స్పష్టత ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు. అసెంబ్లీకి రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న న్యాయస్థానం ఆదేశాలపై స్పష్టత ఇవ్వాలని, విప్ జారీ చేయడం రాజకీయ పార్టీకి ఉన్న హక్కు అని, సుప్రీంకోర్టు తీర్పు10వ షెడ్యూల్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆ పిటిషన్ లో తెలిపారు.