Sachin Tendulkar: మహోన్నతుల సరసన సచిన్ కు చోటు... ఐసీసీ కీలక నిర్ణయం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-18376552d5e9575ccc0c57c5fdb488748e4b33c8.jpg)
- ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో సచిన్ కు స్థానం
- క్రికెట్ కు వన్నె తెచ్చాడంటూ కీర్తించిన ఐసీసీ
- సుదీర్ఘకాలంగా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఘనంగా గౌరవించింది. సచిన్ కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం కల్పించింది. తద్వారా సచిన్ ను ఓ మహోన్నత క్రికెటర్ గా గుర్తించినట్టయింది. క్రికెట్ కు వన్నె తీసుకురావడమే కాకుండా, ఆట అభివృద్ధికి కృషి చేశాడంటూ ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ కు ఐసీసీ జ్ఞాపికను బహూకరించింది.
దీనిపై సచిన్ మాట్లాడుతూ, దీనిని జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని తెలిపాడు. ఎంతో కాలంగా తన వెన్నంటి నిలిచిన కుటుంబసభ్యులు, అభిమానులు, ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా, తన సోదరుడు అజిత్, అర్ధాంగి అంజలి తన కెరీర్ కు వెన్నుదన్నుగా నిలిచారంటూ ధన్యవాదాలు తెలిపాడు. రమాకాంత్ అచ్రేకర్ వంటి గురువు దొరకడం ఓ వరం అని పేర్కొన్నాడు. కాగా, సచిన్ కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం లభించడం పట్ల సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-e55c8d9b024d0a1d51c62e54d6e620fd9b3477ba.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-2a3d48c003b58a8274c0bb8238d7f4ca2cf98006.jpg)