Jagapathi Babu: 'సరిలేరు నీకెవ్వరు' వివాదంపై జగపతిబాబు వివరణ
- ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన జగపతిబాబు
- తనపై జరుగుతున్నదంతా అసత్యప్రచారమేనని వెల్లడి
- పరిస్థితుల కారణంగానే ఆ సినిమాలో లేనంటూ స్పష్టీకరణ
మహేశ్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అయితే, ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు జగపతిబాబు అవమానకర రీతిలో బయటికొచ్చేశాడంటూ గత కొన్నిరోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా జగపతిబాబు వివరణ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. చిత్ర పరిశ్రమ తన కుటుంబం లాంటిదని, అలాంటి చిత్ర పరిశ్రమ గురించి బహిరంగంగా మాట్లాడడం తనకిష్టంలేదని స్పష్టం చేశారు. అయితే, ఓ విషయంలో స్పష్టత ఇవ్వడంలో తప్పులేదని భావిస్తున్నానని తెలిపారు.
"33 ఏళ్ల నా కెరీర్ లో ఇలా ఎప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం రాలేదు. మహేశ్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం నుంచి నేను తప్పుకున్నానంటూ రకరకాల పుకార్లు వస్తున్నాయి. వాటిలో ఎలాంటి వాస్తవంలేదు. వాటిని ఎవరూ నమ్మవద్దు. ఇప్పటికీ ఆ సినిమాలో క్యారక్టర్ అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికీ చేయమంటే ఆ క్యారక్టర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆ సినిమా కోసం రెండు సినిమాలు వదులుకున్నానన్నది కూడా నిజం. కానీ, చిత్ర పరిశ్రమలో కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో ఇదీ ఒకటి. ఆ పరిస్థితుల కారణంగానే నేను ఆ సినిమాలో లేను. నేనా సినిమాను ఎంతో మిస్సవుతున్నాను. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు" అంటూ జగపతిబాబు వీడియోలో తన వైఖరిని వెల్లడించారు.
కాగా, పరిస్థితులే తనను సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి దూరం చేశాయని అంటున్న జగపతిబాబు ఆ పరిస్థితులేంటో మాత్రం తన వీడియోలో వెల్లడించలేదు. దాంతో, మరికొన్ని ఊహాగానాలకు అవకాశం ఇచ్చినట్టయింది.