Jagan: టెక్నాలజీని తానే కనిపెట్టానని చంద్రబాబు అంటారు... ఇంత నష్టం వస్తుందని మాత్రం తెలియదా?: సీఎం జగన్ విసుర్లు

  • పీపీఏలపై అట్టుడికిన శాసనసభ
  • చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు
  • అవసరంలేకున్నా అధికధరలకు విద్యుత్ కొన్నారంటూ ఆరోపణ

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సభలో మాట్లాడుతూ, గత మూడేళ్లలో పీపీఏల విషయంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. టెక్నాలజీకి తానే శ్రీకారం చుట్టానని చంద్రబాబు చెప్పుకుంటుంటారని, మరి ఆ టెక్నాలజీతో ఇంత నష్టం వస్తుందని చంద్రబాబుకు తెలియదా? అంటూ మండిపడ్డారు. నష్టం వస్తుందని తెలిసి కూడా పాతికేళ్లకు పీపీఏలు ఎలా కుదుర్చుకున్నారంటూ జగన్ నిలదీశారు.

విద్యుత్ రంగంలో కేంద్రం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు కూడా మూడేళ్లలో రూ.540 కోట్లకు మించలేదని అన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అవసరం లేకున్నా, అధికధరలకు విద్యుత్ కొనుగోలు చేశారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని జగన్ స్పష్టం చేశారు. 2016 నుంచి 2018 వరకు రూ.5497 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశారని, ఇప్పుడు పీపీఏలపై సమీక్ష అనగానే చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలపై నిపుణుల కమిటీ వేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

కాగా, పీపీఏలపై శాసనసభలో చర్చ సందర్భంగా ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం నడిచింది. సీఎం జగన్ ప్రధానంగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News