Telangana: మీ ప్రకటనలతో నా టైమ్ వేస్ట్ చేస్తారా?.. ఐనాక్స్ థియేటర్ పై పోలీసులకు హైదరాబాదీ ఫిర్యాదు.. కేసు నమోదు!

  • కాచిగూడలోని ఐనాక్స్ లో ఘటన
  • తన 15 నిమిషాలు వృథా చేశారని విజయ్ గోపాల్  ఫిర్యాదు
  • ఇలాంటివాటిని ప్రజలు సహించబోరని వ్యాఖ్య

సాధారణంగా సినిమా థియేటర్ లోకి వెళ్లాక కొద్దిసేపు ప్రకటనలు వస్తాయి. ఆ తర్వాత జాతీయ గీతం ఆలాపన అయ్యాక సినిమా ప్రారంభమవుతుంది. కానీ కొన్ని థియేటర్లు మాత్రం 10-15 నిమిషాల సేపు ప్రకటనలు చూపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి చర్యలతో విసిగిపోయిన ఓ హైదరాబాదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కూడా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదుచేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని కాచిగూడలో చోటుచేసుకుంది.

కాచిగూడలోని మహేశ్వరి-పరమేశ్వరి మాల్ లో ఉన్న ఐనాక్స్ లీజర్ థియేటర్ కు విజయ్ గోపాల్ అనే వ్యక్తి వెళ్లాడు. అయితే సినిమా సమయానికి ప్రారంభం కాకపోగా, థియేటర్ యాజమాన్యం 15 నిమిషాల పాటు ప్రకటనలు చూపించింది. దీంతో తిక్కరేగిన సదరు యువకుడు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన 15 నిమిషాల సమయాన్ని థియేటర్ యాజమాన్యం వృథా చేసిందని ఫిర్యాదులో విజయ్ గోపాల్ చెప్పాడు.

దీంతో అతని ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఐనాక్స్ లీజర్ థియేటర్ పై కేసు నమోదుచేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించిన గోపాల్.. ప్రజల సమయాన్ని వృథా చేయడాన్ని ఇకపై ఎంతమాత్రం అంగీకరించబోమని  స్పష్టం చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News