Andhra Pradesh: ఏపీలో మూడు అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మిస్తాం!: క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్
- రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తాం
- వైద్యవిద్యలో స్పోర్ట్స్ కోటా 2 శాతం పెంచేందుకు కృషి
- టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవంతి
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని ఏపీ టూరిజం, క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. క్రీడాకారుల ప్రోత్సాహం విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వైద్య విద్యలో స్పోర్ట్స్ కోటాను 2 శాతానికి పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో మూడు అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవంతి శ్రీనివాస్ మాట్లాడారు.
క్రీడల వల్ల విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని అవంతి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని పునరుద్ధరించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) తయారు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఇప్పటికే ఆదేశించామని స్పష్టం చేశారు.
ప్రతి జిల్లాలో నెలకోసారి క్రీడా ఈవెంట్లను నిర్వహిస్తామనీ, మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని చెప్పారు. పాఠశాలలు, కాలేజీల్లో మైదానాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ మైదానాలు లేకుంటే మున్సిపల్ గ్రౌండ్లను లీజుకు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.