Rajamouli: రాజమౌళి సినిమాలో తల్లి వేషమంటూ... మహిళా లాయర్ దగ్గర అరకోటి నొక్కేసిన కేటుగాడు!
- 'ఆర్ఆర్ఆర్' నిర్మాతనంటూ పరిచయం
- భార్యకు విడాకులివ్వాలంటూ దగ్గరైన మోసగాడు
- వేషం పేరిట లక్షల కొద్దీ డబ్బు
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్'లో తల్లి పాత్ర ఇప్పిస్తానంటూ, ఓ మహిళా న్యాయవాదికి టోకరా వేసి రూ. 50 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. బాధితురాలు పోలీసులకు వెల్లడించిన వివరాల ప్రకారం, బోయిన్ పల్లిలో మహిళా న్యాయవాది (73) నివాసం ఉంటుండగా, బంజారాహిల్స్ లోని ఓ కలర్ ల్యాబ్ లో పనిచేస్తున్న వీరబత్తిని నరేష్ కుమార్, తాను 'ఆర్ఆర్ఆర్' నిర్మాతనని, తన పేరు ఆదిత్య అని పరిచయం చేసుకున్నాడు.
తన భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నానని చెబుతూ సలహాలు అడిగాడు. ఆపై సినిమాలో ఓ తల్లి పాత్ర ఉందని చెప్పాడు. ఆ పాత్రకు మీరు బాగుంటారని నమ్మబలికాడు. స్క్రీన్ టెస్ట్, ధరావతులు అంటూ నాలుగు నెలల వ్యవధిలో రూ.50 లక్షలు కాజేశాడు. షూటింగ్ కు ఎప్పుడు తీసుకెళ్తారని ప్రశ్నించే సరికి ఫోన్లు స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
కాగా, ఈ కేసులో తన తెలివి తేటలు చూపిన నరేశ్, మొత్తం 15 మంది కారు డ్రైవర్లను ఇరికించాడు. వారందరి ఖాతాల్లో న్యాయవాది నుంచి డబ్బులేయించాడు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని, నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని తెలిపారు.