Karnataka: ఆ లేఖపై నాకు అనుమానాలు ఉన్నాయి: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్
- శ్రీమంత్ పాటిల్ పేరుతో నాకో లేఖ వచ్చింది
- ఈ లేఖను లెటర్ హెడ్ పై రాయలేదు
- ఆ లేఖలో తేదీ కూడా వేయలేదు
తమ ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య తనకు రాసిన లేఖ గురించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ ప్రస్తావించారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీమంత్ పాటిల్ పేరుతో తనకు ఓ లేఖ వచ్చిందని, తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నానని, ఆసుపత్రిలో ఉన్నానని, అందుకే, అసెంబ్లీకి రాలేకపోతున్నట్టు ఆ లేఖలో ఆయన పేర్కొన్నారని అన్నారు. అయితే, ఈ లేఖను లెటర్ హెడ్ పై రాయలేదని, తేదీ కూడా వేయలేదని చెప్పారు.
ఈ లేఖను తాను నమ్మలేనని, దీనిపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పాటిల్ గురించి ఆరా తీయాలని, ఆయన కుటుంబాన్ని తక్షణం సంప్రదించాలని స్పీకర్ ఆదేశించారు. రేపటిలోగా తనకు ఓ నివేదిక ఇవ్వాలని హోం మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పాటిల్ కు హోం శాఖ రక్షణ కల్పించకపోతే తానే డీజీపీతో స్వయంగా మాట్లాడతానని స్పీకర్ చెప్పడం గమనార్హం.
కాగా, విశ్వాసపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కలిసి బయలుదేరిన తమ ఎమ్మెల్యేలు ఎనిమిది మందిలో ఒకరైన శ్రీమంత్ పాటిల్ ఆసుపత్రిలో చేరారని, మిగిలిన వారు కనిపించకుండా పోయారని కాంగ్రెస్ సభ్యుడు డీకే శివకుమార్ స్పీకర్ దృష్టికి తెచ్చారు.