Supreme Court: అయోధ్య కేసులో జూలై 31 వరకూ మధ్యవర్తిత్వాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం
- న్యాయస్థానమే విచారించాలంటూ పిటిషన్
- పూర్తి నివేదికను 18లోగా సమర్పించాలని ఆదేశం
- నివేదికను సుప్రీంకోర్టు ముందుంచిన కమిటీ
అయోధ్య వివాదంపై నడుస్తున్న కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని మరి కొన్నాళ్ల పాటు కొనసాగించాలని సంబంధిత కమిటీకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూవివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశముంటే సూచించాలని పేర్కొంటూ, ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. అయితే మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతి లేదని, దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్‌పై ఈ నెల 11న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం, మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఇప్పటి వరకూ జరిగిన పురోగతిని తెలిపిన పూర్తి నివేదికను 18లోగా సమర్పించాలని ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు కమిటీ తమ నివేదికను నేడు సుప్రీంకోర్టు ముందుంచింది. దానిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ నెల 31 వరకూ మధ్యవర్తిత్వం కొనసాగించాలని కమిటీని ఆదేశించింది. పూర్తి నివేదికను ఆగస్ట్ 1న ఇవ్వాలని సూచించింది. తదుపరి కార్యాచరణపై ఆగస్టు 2న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు స్పష్టం చేసింది.