Japan: జపాన్ లో ఉన్మాది ఘాతుకం.. కాలిబూడిదైన 13 మంది యానిమేషన్ ఉద్యోగులు!
- జపాన్ లోని క్యోటోలో ఘటన
- యానిమేషన్ కంపెనీ భవనంపై పెట్రోల్ పోసి నిప్పు
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
జపాన్ లోని క్యోటో నగరంలో దారుణం చోటుచేసుకుంది. నలభై ఏళ్ల ఓ వ్యక్తి క్యోటో యానిమేషన్ కంపెనీ భవంతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ భవనం కలపతో తయారుచేసింది కావడంతో మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో 13 మంది ఉద్యోగులు సజీవదహనం కాగా, మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పారు.
అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయపడ్డవారిలో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. జపాన్ కాలమానం ప్రకారం నేటి ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని, నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు.
నిందితుడు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో ఇంకా తెలియరాలేదన్నారు. క్యోటో యానిమేషన్ కంపెనీ భవనం ఇంకా మండుతూనే ఉందనీ, ప్రస్తుతం 48 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.