Bigboss: 'బిగ్ బాస్'ను అడ్డుకుని తీరుతామంటున్న ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ
- బిగ్ బాస్ షో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు విరుద్ధం
- మహిళలను కించపరిచే విధంగా షో ఉంది
- క్యాస్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపించాలి
అక్కినేని నాగార్జున హోస్ట్ గా 'బిగ్ బాస్ 3' రియాల్టీ టీవీ షో త్వరలోనే ప్రారంభంకాబోతోంది. మరోవైపు ఈ షోను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇది బిగ్ బాస్ హౌసా? లేక బ్రోతల్ హౌసా? అని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్వేతారెడ్డి, సినీ నటి గాయత్రి గుప్తా ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు, ఈ షోపై ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ కూడా కన్నెర్రజేసింది.
బిగ్ బాస్ షోను అడ్డుకుని తీరుతామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కందుల మధు, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకట్ స్పష్టం చేశారు. ఓయూ గెస్ట్ హౌస్ లో మీడియాతో వారు మాట్లాడుతూ, బిగ్ బాస్ షో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు విరుద్ధమని మండిపడ్డారు. మహిళలను కించపరిచే విధంగా షో ఉందని విమర్శించారు. షో కు సంబంధించి వస్తున్న క్యాస్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.