Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ హత్యకేసు దోషి నళినికి పెరోల్.. రేపే బాహ్యప్రపంచంలోకి!
- కుమార్తె వివాహ ఏర్పాట్ల కోసం ఆరు నెలల పెరోల్ కోరిన నళిని
- నెల రోజులు మాత్రమే మంజూరు చేసిన కోర్టు
- వేలూరులో ఉండనున్న నళిని
- పోలీసుల భద్రత నడుమ నళిని కుమార్తె వివాహం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి నళినికి మద్రాస్ హైకోర్టు పెరోల్ మంజూరు చేసింది. దీంతో రేపు ఆమె జైలు నుంచి విడుదల కానుంది. నళినికి ఆమె తల్లి పద్మిని, కాట్పాడికి చెందిన ఓ మహిళ పూచీకత్తు ఇచ్చినట్టు జైలు అధికారులు తెలిపారు. రాజీవ్ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని భర్త మురుగన్ వేలూరులోని పురుషుల జైలులో ఉండగా, ఆమె మహిళా జైలులో ఉంది. తన కుమార్తె వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉందని, ఆరు నెలలపాటు పెరోల్ ఇవ్వాలన్న నళిని అభ్యర్థనకు మద్రాస్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, నెల రోజులు మాత్రమే పెరోల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే, వేలూరు రంగాపురంలోని పులవార్ నగర్‌లో ఉన్న ద్రవిడ ఉద్యమ తమిళ సమాఖ్య రాష్ట్ర డిప్యూటి జనరల్ సెక్రటరీ సింగరాయర్ ఇంట్లో ఉండేందుకు నళినికి కోర్టు అనుమతి ఇచ్చింది. బెయిలు పత్రాలను, వేలూరులో ఆమె ఉండబోయే ప్రాంతానికి సంబంధించిన పత్రాలను నళిని జైలు అధికారులకు సమర్పించింది. కాగా, నళిని కుమార్తె వివాహానికి పోలీసులు భద్రత కల్పించనున్నారు.