BCCI: టీమిండియా కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే రవిశాస్త్రికే ప్రాధాన్యత!

  • టీమిండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
  • రవిశాస్త్రికి మద్దతిస్తున్న ఆటగాళ్లు
  • మళ్లీ ఆయనే కోచ్ గా రావాలని కోరుకుంటున్న వైనం

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ ఓటమితో నిష్క్రమించినా,  ప్రధాన కోచ్ రవిశాస్త్రి పనితీరు పట్ల జట్టు ఆటగాళ్లలో సదభిప్రాయమే ఉన్నట్టు బీసీసీఐ వర్గాలంటున్నాయి. అందుకే, కొత్త కోచ్ నియామకంలో రవిశాస్త్రి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఆయనకే అధిక ప్రాధాన్యత ఉంటుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. జట్టు కోసం రవిశాస్త్రి ఎంతో చేశాడన్న నమ్మకం ఆటగాళ్లలో ఉందని, మరోసారి రవిశాస్త్రే కోచ్ గా రావాలని వారు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

రవిశాస్త్రి హయాంలోనే టీమిండియా టెస్టుల్లో నంబర్ వన్ గా ఎదిగిందని, ఇంగ్లాండ్ టాప్ లెవల్ కి చేరకముందు వన్డేల్లోనూ మనవాళ్లే ఉన్నతస్థానంలో నిలిచారని ఆ అధికారి వివరించారు. ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినంత మాత్రాన కోచ్ అసమర్థుడు అయిపోడని అన్నారు.

బోర్డు వైఖరి చూస్తుంటే, టీమిండియా కోచ్ గా ఏడాదికి రూ.8 కోట్ల పైచిలుకు పారితోషికం అందుకుంటున్న రవిశాస్త్రి మరోసారి అవే బాధ్యతల్లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకుంటే కాలపరిమితి పొడిగింపు పొందుతాడని తెలుస్తోంది. కాగా, టీమిండియా కోచ్ ఎంపిక బాధ్యతను బీసీసీఐ పాలకవర్గం కపిల్ దేవ్ కమిటీకి అప్పగించింది. కపిల్ కమిటీలో అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి ఇతర సభ్యులు.

BCCI
Ravi Shastri
India
Coach
  • Loading...

More Telugu News